ఒకేరోజు 15 లక్షల మందికి వ్యాక్సిన్

ఒకేరోజు 15 లక్షల మందికి వ్యాక్సిన్
  • టీకా వేయడంలో రికార్డ్
  • 49 రోజుల్లో 1.94 కోట్ల డోసులు కంప్లీట్
  •  జులై నాటికి 30 కోట్ల మందికి టీకాలు: కేంద్ర హెల్త్ మినిస్ట్రీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా15 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ ఒక్కరోజులో ఇంతమందికి టీకాలు వేయడం ఇదే ఫస్ట్ టైం అని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ శనివారం వెల్లడించింది. శుక్రవారం (మార్చి 5) నాటికి వ్యాక్సినేషన్ ప్రారంభించి 49 రోజులు అయిందని, ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 14,92,201 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది. వీరిలో12 లక్షల మందికి ఫస్ట్ డోస్, 3 లక్షల మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ చేసినట్లు వివరించింది. దేశంలో మొత్తం 1,94,97,704 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు పేర్కొంది. వచ్చే జులై నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపింది. జనవరి16న ఫస్ట్ ఫేజ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ కాగా, హెల్త్ వర్కర్లకు టీకాలు వేశారు. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు వేశారు. ఫిబ్రవరి 13 నుంచి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ షురువైంది. సెకండ్ ఫేజ్ లో మార్చి 1 నుంచి వృద్ధులు, కోమార్బిడిటీస్ ఉన్నవారికి టీకాలు ప్రారంభించారు.

కొత్తగా 18 వేల మందికి వైరస్

దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే18,327 కేసులు నమోదయ్యాయి. గత 36 రోజుల్లో ఇవే రోజువారీ అత్యధిక కేసులు అని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ శనివారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,11,92,088కి పెరిగింది. ఇక దేశంలో వరుసగా నాలుగో రోజు యాక్టివ్ కేసులు కూడా పెరిగాయి. ప్రస్తుతం 1,80,304 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 1.61 శాతం. శుక్రవారం మరో 108 మంది కరోనాతో చనిపోయారు. మహారాష్ట్రలో 53, కేరళలో 16, పంజాబ్ లో 11 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 1,57,656కు పెరిగింది. శుక్రవారం18 రాష్ట్రాలు, యూటీల్లో జీరో కరోనా డెత్స్ నమోదయ్యాయి.

రెండు స్టేట్స్ కు హైలెవెల్ టీంలు

మహారాష్ట్ర, పంజాబ్లో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుండటంతో స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్లకు సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు హైలెవెల్ పబ్లిక్ హెల్త్ టీంలను పంపింది. పరిస్థితిని అంచనా వేయడంతో పాటు కరోనా సర్వెలెన్స్, కంట్రోల్, కంటైన్ మెంట్ చర్యలు తీసుకోవడంలో ఈ టీంలు రాష్ట్ర అధికారులకు సూచనలు చేయనున్నాయి. పంజాబ్కు డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ సీనియర్ సీఎంవో పి.రవీంద్రన్ ఆధ్వర్యంలోని టీంను, మహారాష్ట్రకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ ఎస్ కే సింగ్ ఆధ్వర్యంలోని టీంను పంపినట్లు కేంద్రం తెలిపింది.

టెస్టింగ్, ట్రేసింగ్ మరవొద్దు..

హర్యానా, ఏపీ, ఒడిశా, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్ లోని 63 జిల్లాల్లో కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతుండటం, టెస్టుల సంఖ్య తగ్గుతుండటం పట్ల కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తి పీక్ లెవెల్లో ఉన్నప్పుడు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ల ద్వారానే మంచి రిజల్ట్స్ వచ్చాయన్న విషయాన్ని మరచిపోవద్దని ఈ రాష్ట్రాలు, యూటీలకు సూచించింది. ఆయా జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని, ట్రేసింగ్, వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలని చెప్పింది. ఈ జిల్లాలపై నిర్లక్ష్యం చేస్తే పొరుగు రాష్ట్రాలకు మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతుందని హెచ్చరించింది. యాక్టివ్ కేసులు పెరుగుతున్న జిల్లాల్లో ఎక్కువగా  ఢిల్లీలో 9, హర్యానాలో 15, ఏపీలో 10, ఒడిశాలో 10 జిల్లాలు ఉన్నాయని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది.

5 రాష్ట్రాల్లో పెరుగుతున్నయ్

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, తమిళనాడులో అత్యధికంగా డైలీ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నమోదైన మొత్తం కేసుల్లో 82 % కేసులు ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలో కొత్తగా10,216 కేసులు, కేరళలో 2,776, పంజాబ్ లో 808 కొత్త కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 21 లక్షలకు చేరాయి. ఇక్కడ 90,055, పంజాబ్ లో 6,661 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 21 స్టేట్స్, యూటీల్లో వెయ్యికి తక్కువగానే యాక్టివ్ కేసులు ఉన్నాయి.